- జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికనూ తప్పుపట్టలే: ఉత్తమ్ కుమార్ రెడ్డి
- హైకోర్టు తీర్పు సీబీఐ విచారణకు అడ్డంకి కాదని మంత్రి వెల్లడి
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలకు, అందుకు బాధ్యులైన వారెవరికీ హైకోర్టు క్లీన్ చిట్ ఇవ్వలేదని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం సచివాలయంలో మీడియాతో ఆయన చిట్ చాట్ చేశారు.
కాళేశ్వరంపై హైకోర్టు ఇచ్చిన తీర్పు సీబీఐ విచారణకు ఏమాత్రం అడ్డంకి కాదని చెప్పారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 6ను కొట్టివేయాలని దాఖలైన పిటిషన్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పును మంత్రి వివరించారు.
‘‘జీవో నం.6ను కొట్టివేయాలని పిటిషనర్లు కోరారు. అయితే, జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటును హైకోర్టు తప్పుపట్టలేదు. దానిని సమర్థించింది. కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీస్ చట్టం,-1952లోని సెక్షన్ 3 ప్రకారం ప్రభు త్వం ఏర్పాటు చేసిన కమిషన్ రాజ్యాంగబద్ధమేన ని కోర్టు స్పష్టం చేసింది. కమిషన్ ఏర్పాటు అధికారిక పరిధిని మించలేదని, ఇది అసమంజసం, అక్రమంకా దని కోర్టు తేల్చి చెప్పింది.
జ్యుడీషియల్ కమిషన్ నివేదికలో పేర్కొన్న కొందరు బాధ్యులపై చర్యల విషయంలోనే కోర్టు కొన్ని అభ్యంతరాలు తెలిపింది. పిటిషనర్లకు నిర్ణీత ఫార్మాట్ ప్రకారం నోటీసులు ఇవ్వలేదనే టెక్నికల్ అంశాన్నే కోర్టు తప్పుపట్టింది. ఆ కారణంతోనే కమిషన్ నివేదిక ఆధారంగా వారిపై చర్యలు తీసుకోవద్దని మాత్ర మే రిలీఫ్ ఇచ్చింది.
ప్రాజెక్టు కుంగిపోయింది నిజం. ఎంచుకున్న సైట్ నుంచి డిజైన్లు, నిర్మాణాలు, నిర్వహణ అన్నిచోట్ల అవకతవకలు జరిగాయి. వారికి నోటీసులు ఇవ్వలేదనే కారణంగా, వాళ్లపై కమిషన్ చేసిన రిమార్క్స్ మాత్రమే ఇన్ ఆపరేటివ్ గా ఉంటాయని హైకోర్టు తెలిపింది. ఇది పూర్తిగా ప్రొసీజరల్, టెక్నికల్ అంశం మాత్రమే’’ అని మంత్రి వివరించారు.
నివేదికల ఆధారంగానే సీబీఐకి..
మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాక్ 2023 అక్టోబర్ 21న కుంగిపోయిందని, ఆ బ్యారేజీ దగ్గరకు వెళ్తే ఎవరికైనా అది కనిపిస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ‘‘రూ. లక్ష కోట్లతో బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన ఈ ప్రాజెక్ట్ వారి హయాంలోనే కూలిపోయింది. అందుకు కారణాలేమిటో తేల్చాల్సిన బాధ్యత మా ప్రజా ప్రభుత్వంపై ఉంది.
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా బ్యారేజీల కుంగుబాటుకు కారణాలు, డిజైన్లు, నిర్మాణం, నిర్వహణ లోపాలపై ప్రాథమిక నివేదికను బీఆర్ఎస్ హయాంలోనే సమర్పించింది. ప్రాజెక్టు సైట్ ఎంపిక నుంచి డిజైన్లు, నిర్మాణంలో జరిగిన లోపాలన్నింటినీ మా ప్రభుత్వం నియమించిన విజిలెన్స్ కమిషన్ బయటపెట్టింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన లోపాలు, అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన రిటైర్డ్ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కూడా ఇంజనీర్లను, ఐఏఎస్ అధికారులను, అప్పటి పరిపాలనా బాధ్యులను విచా రించి నివేదికను సమర్పించింది.
అసలు బాధ్యులెవరు, దోషులెవరు, ఎక్కడెక్కడ తప్పులు జరిగాయి, ఏమేం లోపాలున్నాయి అనే అంశాలపై ఎన్డీఎస్ఏతో పాటు విజిలెన్స్, ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికలపై ఆగస్టు నెలలోనే ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించింది. ఈ నివేదికల ఆధారంగా లోతైన దర్యాప్తు జరపాలని సీబీఐ విచారణకు లేఖ రాసింది. గత ఏడాది సెప్టెంబర్ 1వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఈ దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ జీవోతో పాటు నోటిఫికేషన్ జారీ చేసింది’ అని మంత్రి పేర్కొన్నారు.
కాళేశ్వరం అతిపెద్ద మానవ తప్పిదం
గడిచిన రెండేళ్లుగా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి చుక్క నీరు కూడా అందలేదని, కానీ ఏటా ఈ ప్రాజెక్టు పేరిట ప్రభుత్వం రూ.15 వేల కోట్ల నుంచి రూ.20 వేల కోట్ల వరకు అప్పులు, వడ్డీలు భరిస్తోందని మంత్రి ఉత్తమ్ చెప్పారు. ‘‘కేవలం రెండు పిల్లర్ల దగ్గర మాత్రమే కాదు, మొత్తం ఫౌం డేషన్.. అంటే మూడు బ్యారేజీల పునాదులు లోపభూయిష్టంగా ఉన్నాయని ఇప్పటికే దేశం లోని ప్రముఖ సంస్థల నిపుణులు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యం పూర్తిగా మానవ తప్పిదమే. ప్రజాధనం వృథా అయింది. దీని బాధ్యులను ప్రజల ముందు నిలబెట్టా ల్సిన బాధ్య త మా ప్రభుత్వంపై ఉంది" అని స్పష్టం చేశారు.

